bird Flu: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ మరణం కలకలం రేపుతోంది.. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఏపీలో తొలి మరణంపై కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. దీంతో కేంద్రం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఢిల్లీ ఎన్‌సీబీకి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరొక డాక్టర్, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందంగా అధ్యయనం మొదలుపెట్టారు. మొదట ఎయిమ్స్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర వైద్య బృందం.. అసలు చిన్నారి పరిస్థితి ఏంటి? ఎప్పుడు జబ్బు పడింది.. ఆస్పత్రిలో ఎప్పుడు చేరారు.. ఆమెకు అందిన చికిత్స, ఎలాంటి వైద్యం అందించారు.. అన్నదానిపై చర్చించారు. ఇక, చిన్నారి మృతి చెందిన నరసరావుపేటకి వెళ్లిన కేంద్ర వైద్య బృందం.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులు చికెన్ కొన్న షాపుకు వెళ్లి శాంపిల్స్ సేకరించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి సమాచారం సేకరించారు.
Read Also: AIMIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన..
మరోవైపు, నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి, ఆ తర్వాత పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం విదితమే.. బాలిక కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు.. ఇక, ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదనే వివరాలను వెల్లడించారు.. విశాఖ, విజయవాడ, కర్నూలులో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు.