బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.
వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ గొప్పతనం.రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి వివాదాలు రెచ్చగొడుతున్నారు. ఐకమత్వం అంటే ఏమిటో జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా నిరూపించాం అన్నారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మతం పేరుతో బీజేపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తోందన్నారు. జిన్నా టవర్ అంశాన్ని ఇదే ఉద్దేశంతో తెరపైకి తెచ్చారు.మైనార్టీల ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు గిరి. అన్ని వర్గాల ఆదరణతోనే మేము రాజకీయాల్లో ఉన్నాం.దేశ భక్తి గురించి బిజేపి నేతలా మాకు నేర్పేది….సిగ్గుండాలి. గాడ్సేను కొలుస్తున్న బీజేపీ నుండి దేశ భక్తి నేర్చుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.