విజయవాడ నగరంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలపై ఈ ఏడాది కరోనా ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది మంది హాజరయ్యే గుణదల మేరీ మాత ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సందర్భంగా లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం కష్టసాధ్యమని, భక్తులు ఇబ్బందికి గురికాకూడదని నిర్వాహకులు యోచిస్తున్నారు. అందుకే ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.
Read Also: పగబట్టిన ‘కాకి’.. ఏకంగా ఏడుగురిపై దాడి
కాగా ప్రతి సంవత్సరం నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తరలివస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో చివరి రోజు ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా అందరూ మేరీమాత పండుగలో పాలు పంచుకుంటారు.