Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా అని తేలిగ్గా సమాధానం ఇస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసేలా వ్యవహరిస్తున్నారు,” అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Chandrababu : అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
కల్తీ మద్యం అంశంలో వైఎస్సార్‌సీపీ నేతలను నకిలీ సాక్ష్యాలతో అరెస్టు చేయడం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలే అని ఆయన ఆరోపించారు. “ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించడానికి మా నేతలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం నాయకుడు కొండారెడ్డిపై తప్పుడు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఆయనపై దాడి చేసిన విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది,” అని అమర్నాథ్ తెలిపారు. “కొండారెడ్డిని నవంబర్ 2వ తేదీ ఉదయం 7.10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులు రైల్వే స్టేషన్‌లో సాయంత్రం అరెస్టు చేశామని చెప్పారు. ఉదయం అరెస్టు చేసి సాయంత్రం చూపిస్తే, మధ్యలో ఆ వీడియో టీడీపీ అధికారిక పేజ్‌లో ఎలా వచ్చింది? టీడీపీకి టైమ్ మిషన్ ఉందా?” అని ఎద్దేవా చేశారు.
అలాగే, కొండారెడ్డి బైక్‌ను పోలీసులు 14 కిలోమీటర్లు తిప్పిన విషయం కూడా అనుమానాస్పదమని ఆయన పేర్కొన్నారు. “పూర్తిగా పథకం ప్రకారమే ఈ అరెస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారు,” అని అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. “గత ఏడాది కాలంగా మిస్సింగ్ కేసులు భారీగా పెరిగాయి. ఎన్సీఆర్బీ రికార్డులు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. గుడికి దర్శనం కోసం వెళ్లినవారికైనా, స్కూల్‌కి వెళ్లిన పిల్లలకైనా ఇప్పుడు భద్రత లేదు. పొలానికి వెళ్లినా చంపేస్తున్నారు, బస్సు ఎక్కినా ప్రమాదం, విమానం ఎక్కినా భయం.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి,” అని ఆవేదన వ్యక్తం చేశారు అమర్నాథ్ . “డ్రగ్స్ కేసులో తప్పుడు ఆరోపణలు సృష్టించి వైఎస్సార్‌సీపీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు? కూటమి ప్రభుత్వం వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను కూడా చెడగొట్టాలని చూస్తోంది,” అని అమర్నాథ్ ఆరోపించారు.