టీడీపీ నేతల్ని ఏపీ అధికార పార్టీ టార్గెట్ చేసిందని ఆపార్టీ నేతలు మండిపడ్డారు. మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర (Darapaneni Narendra)ను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ (Granted Bail) మంజూరైంది. గన్నవరం ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ విషయంలో సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. స్మగ్లింగ్ విషయంలో సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. నరేంద్రను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.
Read Also: Passenger Attack on Conductor: కండక్టర్ పై ప్రయాణికుడు దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
అనంతరం దారపనేని నరేంద్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. అంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి రెండు గంటలకు న్యాయమూర్తి వద్ద హాజరు పరిచారు సీఐడీ పోలీసులు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి … నరేంద్ర రిమాండ్ కు తిరస్కరించారు న్యాయమూర్తి.. బెయిల్ ఇవ్వడంతో దారపనేని నరేంద్రను విడుదల చేశారు పోలీసులు.. నరేంద్రకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని లాయర్లు వాదనలు వినిపించారు. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన కొల్లు అంకబాబు రిమాండును కోర్టు తిరస్కరించి.. దర్యాప్తు అధికారికి షోకాజ్ నోటీసు జారీచేసింది.
ఇదే విషయాన్ని లాయర్లు గుర్తు చేశారు. నరేంద్ర రిమాండును తిరస్కరించాలని కోరారు. సీఎంవోను, ప్రభుత్వానికి అప్రతిష్ఠ వచ్చిందని.. నరేంద్ర అమరావతి పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. బాగా పలుకుబడి కలిగిన ఆయనకు రిమాండు విధించకపోతే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. కానీ ఆ వాదనలు విన్న తర్వాత జడ్జి బెయిల్ మంజూరు చేశారు.తనను సీఐడీ అధికారులు కొట్టారని నరేంద్ర జడ్జి ముందు ఆరోపించారు. దెబ్బలు బయటకు కనపడకుండా కొట్టారని.. ఝండూబామ్ రాసి మరీ చిత్రహింసలు పెట్టారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సీఐడీ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు నరేంద్ర భార్య సౌభాగ్యం హైకోర్టు సీజేకు లేఖ రాశారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తీసుకెళ్లారని.. ఎందుకు తీసుకెళుతున్నారని అడిగితే సీఐడీ పోలీసులమని చెప్పారని ప్రస్తావించారు. కొందరు పోలీసు అధికారులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. నరేంద్ర చేసిన నేరమేంటో కూడా చెప్పకుండా.. ఇంట్లోకి చొరబడి 41ఏ నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రి ఎవరి ఇంట్లోకైనా చొరబడే హక్కు పోలీసులకు ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈవ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Read Also: Cannabis plants: పెరట్లో గంజాయి సాగు.. ఎక్కడో తెలుసా?