Site icon NTV Telugu

Congress Party: ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు

Apcc Chief

Apcc Chief

Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు. అనంతరం ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన వారికీ ధన్యవాదాలు తెలియజేశారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. అన్ని అనుబంధ శాఖలను కలుపుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని గిడుగు రుద్రరాజు అన్నారు. ఓటు బ్యాంకు పెంచుకునేలా అందరం కలిసి అడుగులు వేస్తామన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారే నాయకుడు అని.. లోకల్ క్యాడర్‌ను‌ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నీ కులం ఏదని అడిగితే.. తనకు కులం లేదని చెప్తానన్నారు. కులం, మతం‌ కాదు.. మానవత్వంతో ముందుకు సాగుదామని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబుల స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసులకు భయపడి మోదీ ముందు మోకరిల్లే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఉత్తరాంధ్ర పర్యటన చేస్తానని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అందరితో సమావేశాలు నిర్వహిస్తానని.. నాయకులందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎవరైనా వచ్చి తనను కలిసి అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు.

Read Also: Selfie Tragedy: రేపే పెళ్లి.. సెల్ఫీ కోసం వెళ్లి లోయలో పడ్డారు

మన కులం, మతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించి మోదీ నియంతృత్వ విధానాలకు చరమ గీతం పాడాలన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి వైసీపీని తరిమికొట్టాలని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్‌లను తొలగించాలని మోదీ చూస్తున్నారని.. ఏపీ పునర్విభజన చట్టం బిల్లు అమలుకు పోరాటం చేయాలని తెలిపారు. అంబానీ, అదానీలకు బ్రోకర్‌గా మోదీ పాలన చేస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.

మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఏపీ వ్యవహారాల్లో రుద్రరాజు బాగా పని చేస్తారని భావిస్తున్నానని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకు పూర్వ వైభవం తెచ్చేలా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. తాను, శైలజానాథ్, రుద్రరాజు కలిసి పని చేశామని.. వైఎస్ఆర్, కేవీపీ తమను అనేక సందర్భాల్లో మార్గదర్శకం చేశారని తెలిపారు. తాము ఆశించకపోయినా తమను వాళ్లు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అప్పగించారన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో నాయకులు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. బీజేపీ నాయకులు అదానీ, అంబానీ వంటి వారికి దోచి పెడుతున్నారని విమర్శించారు. పేదలు మరింత దిగజారే విధంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. పెద్దల సూచనలను పరిగణలోకి తీసుకుని రుద్రరాజు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం కోసం తాము పని‌చేస్తామన్నారు.

Exit mobile version