G. V. L. Narasimha Rao: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ- శ్రమ్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన కానుక అని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. ఈ- శ్రమ్ రిజస్ట్రేషన్ పథకంపై ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఈ – శ్రమ్ కార్డుదారులు భవిష్యత్తులో సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందుతారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకం కింద 1.51 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటివరకు కేవలం 70.92 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. ఇ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల కవరేజీ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చాలా అస్తవ్యస్తంగా ఉందని… రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో కవరేజీ దయనీయంగా 30,000 కంటే తక్కువగా ఉందని.. మంత్రి వెల్లడించారు.
Read Also: Vijay Sai Reddy: ఏపీ హైకోర్టులో ఆరు జడ్జీల ఖాళీలు
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పథకం కింద 100 శాతం లబ్ధిదారుల నమోదుకు అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందడం లేదని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వివిధ జిల్లాల్లోని బీజేపీ శ్రేణులు అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించి వారికి ఈ-శ్రమ్ కార్డులు అందజేసేందుకు చురుకుగా సహకరించారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కార్మిక శాఖ సహాయ నిరాకరణ కార్మిక వర్గాలపై వైసీపీ యొక్క ఉదాసీనత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.