NTV Telugu Site icon

Fake Officer: విశాఖలో ఫేక్ సివిల్ సప్లై అధికారి గుట్టురట్టు

Fake1

Fake1

అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్‌ సిలిండర్లకు బదులు డొమెస్టిక్‌ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.

తాను పౌర సరఫరాల శాఖ అధికారినంటూ…అపరాధ రుసుం కింద రూ.పది వేలు చెల్లించాలని చెప్పడంతో ఆ సెంటర్‌ నిర్వాహకుడు లంచం కింద రూ.ఏడు వేలు ఫోన్‌ పే చేశారు. ఇదేవిధంగా చక్రవర్తి, శ్రీనివాస్‌లు ఈ నెల 23న విజయ మెస్‌ నిర్వాహకుడు మల్లవరపు శ్రీనివాసరావును కూడా బెదిరించి డబ్బులు వసూలుచేశారు. శనివారం గోదావరి టిఫిన్‌ సెంటర్‌ వద్ద వారిద్దరినీ చూసిన శ్రీనివాసరావు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని విచారించగా నకిలీ అధికారిగా తేలడంతో చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన శ్రీనివాస్‌ పరారయ్యాడు. చక్రవర్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని, పరారీలో మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులమని వచ్చి దందా చేస్తే తమకు తెలపాలని పోలీసులు కోరారు.

Asaduddin Owaisi: మోడీ డిగ్రీ పట్టాకోసం తాజ్‌మహల్‌ కింద వెతుకుతున్నారు