13 రాష్ట్రాలతో పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలంటూ కేంద్రం చేసిన ప్రకటన కలకలం రేపింది.. ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ … 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్‌ను నిషేధించాలంటూ పవర్ ఎక్స్ఛేంజీలైన ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్ఛేంజ్‌లను కేంద్రం కోరడం చర్చగా మారింది.. ఈ జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, ఈ పరిణామాలపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్.. విద్యుత్ క్రయ విక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్‌కి వర్తించదని స్పష్టం చేశారు.
Read Also: Arvind Kejriwal: జాతీయ మిషన్‌లో చేరాలని మిస్డ్ కాల్ ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
పవర్ ఎక్స్ ఛేంజీకి ఏపీ విద్యుత్ పంపిణీ సంస్ధలు ఎటువంటి బకాయిలు పడలేదన్నారు విజయానంద్.. ఏపీ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 350 కోట్లు చెల్లించేశాయని స్పష్టం చేసిన ఆయన.. సమాచారం లోపం కారణంగానే విద్యుత్ క్రయ విక్రయాల నిషేధిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ని చేర్చారని తెలిపారు.. ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారమైందని క్లారిటీ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ బకాయిలు లేనట్టుగా కేంద్రం ఇచ్చిన జాబితాలో నమోదైందని ఆయన స్పష్టం చేశారు. దీంతో విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఆంధ్రప్రదేశ్‌కి వర్తించదని వెల్లడించారు. కాగా, తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు, రాజస్థాన్ రూ. 500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ రూ. 434 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు, మహారాష్ట్ర రూ. 381 కోట్లు, చత్తీస్‌గఢ్ రూ. 274కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు, ఝార్ఖండ్ రూ. 214 కోట్లు, బీహార్ రూ. 172 కోట్లు బకాయి ఉన్నట్టు కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.. 13 రాష్ట్రాల్లోని 27 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అన్ని విద్యుత్ మార్కెట్ ఉత్పత్తులను కొనడం-అమ్మడం/డెలివరీ చేయడం 2022 ఆగస్టు 19 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు ఖచ్చితంగా నిషేధించాలని కేంద్ర తెలిపిన విషయం విదితమే.