ఏపీలో పీఆర్సీపై రగడ నడుస్తోంది. కొన్ని నెలలు 11వ పీఆర్సీపై కసరత్తు చేసిన జగన్ సర్కార్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించింది. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన అంశాలను పరిష్కరించారని వెల్లడించారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటించిన జీవో ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల వేతనం విషయంలో అంకెల గారడి చేసిందని ఆయన ఆరోపించారు.
ఉద్యోగుల వేతనం తగ్గకుండా చూడాలని సీఎం స్వయంగా చెప్పినా అధికారులు జీవోలు ఇచ్చేశారని ఆయన విమర్శించారు. ఇది మాకు ఆక్షేపణీయమని, ఉద్యోగులు విడివిడిగా పోరాడే కన్నా కలిసి ఒకే రకమైన కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నామన్నారు. ఇందులో భేషజాలకు తావులేదు అంతా పోరాడేది ఉద్యోగుల కోసమేనని ఆయన అన్నారు. కలిసి పని చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కోరామని, దానికి వెంకట్రామిరెడ్డి అంగీకారాన్ని తెలిపారన్నారు. ఎన్జీవోలు, రెవెన్యూ సంఘాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని, రేపట్లోగా ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఒక రూపం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.