చలో విజయవాడ లో భాగంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట రామిరెడ్డి బైక్ పై విజయవాడ బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పే స్లిప్ లు చూస్తే గానీ సాలరీ పెరిగిందో తగ్గిందో తెలుసుకోలేని స్థితిలో ఉద్యోగులు లేరని, న్యాయబద్ధమైన హక్కు కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు అవసరమైన ఆందోళన చేసిన ఘటనలు చూశాం ..కానీ ఉద్యోగుల నుండి ఈ స్థాయి వ్యతిరేకత మూట కట్టుకుని ప్రభుత్వం ఏం సాధిస్తుంది అని ఆయన మండిపడ్డారు.
పది రోజుల నుండి మొత్తుకున్నా ఫలితం లేదు…అందుకే నిరసన బాట పట్టాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నించాం కానీ ప్రభుత్వం మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు. మాకు న్యాయం చేయాలని మాత్రమే పోరాటం చేస్తున్నామని, నేటి చలో విజయవాడ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఉద్యోగులు స్వచందంగా వస్తున్నారని ఆయన అన్నారు. పోలీస్ లను అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపాలని చూడటం ప్రభుత్వం మమ్మల్ని దూరం చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.