Election Notification: ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
* ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ..
* ఏప్రిల్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన
* మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
* మే 9వ తేదీన రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు
అయితే, సంఖ్యా బలం ఆధారంగా ఎంపీ స్థానం కూటమి ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంది. కాగా, కూటమి తరపున ఏ పార్టీకి చెందిన వారికి సీటు కేటాయిస్తారన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. బీజేపీ నుంచే విజయ సాయిరెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ నడుస్తుంది. దీనిపై ఢిల్లీలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లీక్ ఇచ్చారు. కానీ, రాజకీయం వదిలేసి.. వ్యవసాయం చేస్తానని రాజీనామా ప్రకటన చేసిన రోజు చెప్పిన సాయిరెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పర్యటనలో ప్రత్యక్షమైయ్యారు. దీంతో విజయ సాయిరెడ్డి మళ్లీ మనస్సు మార్చుకుని పొలిటికల్ లోనే ఉండనున్నారా అనే చర్చ కొనసాగుతుంది.