YCP vs Janasena: నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైకాపా కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. పురపాలక అభివృద్ధి పనుల్లో జాప్యం, పారదర్శకత లోపం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. పురపాలక చట్టంలోని నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చించి ఓటు వేయాలని వైసీపీ కౌన్సిలర్లు అభ్యర్ధన పత్రాన్ని అధికారులకు అందజేశారు.
Read Also: Zelenskyy: ఆస్తులు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎంత పెరిగిందంటే..!
2021 స్థానిక సంస్థలు ఎన్నికల్లో నిడదవోలు మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డులకుగాను 27 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ సహా ఏడుగురు. కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే.. వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒకరు టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం పెడితే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది. దీనితో మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Chandigarh: రోడ్డుపై భార్య రీల్స్.. ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపతి ఆదినారాయణకు రెండున్నర ఏళ్లు, ఆ తరువాత వైసీపీ కౌన్సిలర్ కామిశెట్టి వెంకటసత్యనారాయణకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఒప్పందం జరిగింది. అయితే, సత్యనారాయణకు అనారోగ్యం కారణంగా మార్పు ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలోని అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మరాయి. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో పదకొండు మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరుకోవడంతో వివాదంగా మారింది. జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది. వీరికి తోడు కౌన్సిల్లో టీడీపీకి ఒకరు ఉన్నారు. దీనితో జనసేన బలం 16, వైసీపీ బలం కూడా పదహారే ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన.. వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి..