Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అది రోడ్డు ప్రమాదంగా తేల్చిన పోలీసులు.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు.. అయితే, పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అనడానికి అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్.. అసలు మృతదేహాన్ని ఘటనా స్థలం వద్దకు వెనుక నుంచి తీసుకువచ్చినట్లుగా నాకు అనుమానం ఉందన్నారు. రీపోస్ట్ మార్టం కోసం హైకోర్టులో పిల్ వేశానని హర్ష కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నేను వేసిన పిల్ కు సహకరించాలని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్ష కుమార్ కోరారు.
Read Also: Harish Rao: కేసీఆర్ సభపై ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ పెరిగింది..
మరోవైపు, సీబీఐ విచారణ చేసినా పాస్టర్ ప్రవీణ్ కేసులో న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు హర్షకుమార్.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసులను సీబీఐ ఏమీ తేల్చలేదని గుర్తు చేశారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వచ్చే నెల 24న పాస్టర్ ప్రవీణ్ ఘటనా స్థలం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హర్ష కుమార్ ప్రకటించారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించ వద్దని విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభకు కేఏ పాల్ ను ఆహ్వానిస్తానని అన్నారు.. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని నమ్మేవాళ్లు వచ్చేనెల 24న బహిరంగ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక, సీఎంగా ఉన్న చంద్రబాబును ఏకవచనంతో సంభోదించడం తప్పే, ఫ్రస్టేషన్ లో ఉండి సీఎం చంద్రబాబును ఏకవచనంతో సంభోదించినందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. కాగా, ‘నన్ను అరెస్టు చేసి పోలీసులు 5 గంటల పాటు కారులో తిప్పడం వల్లే అసహనానికి లోనై కోపంలో సీఎంను ఏకవచనంతో మాట్లాడా.. ఆ తర్వాత అలా మాట్లాడినందుకు బాధపడ్డాను అన్నారు.. వ్యక్తిగత విమర్శలు నా స్వభావం కాదు. అవసరమైతే క్షమాపణ చెబుతా. ఏ పార్టీనైనా పొగడటం నాకు చేతకాదు. అంశాల ప్రాతిపదికన విమర్శిస్తాను అంటూ రెండు రోజుల క్రితం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ రోజు మీడియా సాక్షిగా సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.