ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు.
Read Also: Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..
ఇప్పటికే కేంద్రం రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసిందని సోము వీర్రాజు తెలిపారు. రూ.75 వేల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ది చేస్తున్నామని అన్నారు. అమరావతి రాజధానికి 15 వేల కోట్లు కాకుండా.. రింగ్ రోడ్డుకు అదనంగా 18 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అనడానికి కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిలకు హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా చెందుతుంటే.. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదని వైసీపీ విమర్శలపై మండిపడ్డారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వ హయంలో అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పుకుంటున్న వైసీపీకి.. 11 సీట్లే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో.. మాజీ సీఎం జగన్ ఒకసారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు