Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని వాగేవాళ్లను, ఇక్కడ ఉండి “మేమొస్తే” అంటూ బెదిరించే వారిని ఏం చేయాలన్నదే తన ప్రశ్న అని పవన్ వ్యాఖ్యానించారు. కిరాయి గ్యాంగ్‌లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే, అప్పుడు జగన్ ఎక్కడ ఉంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
గత ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సమాజంలో చీలికలు తెచ్చేలా పిల్లలకు చిన్న వయసులోనే కులాలను అంటగట్టడం సరికాదని అన్నారు. ఇది రాజకీయం కాదని, సమాజాన్ని వెనక్కి నెట్టే విధానమని విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా తాను పవన్ కల్యాణ్‌లాగే ఉంటానని స్పష్టం చేశారు. అన్నీ డిసైడ్ అయ్యే ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, ప్రజల్లోకి వచ్చి మాట్లాడే వ్యక్తినని అన్నారు. అవసరమైతే యోగీ ఆదిత్యనాథ్ తరహా విధానాలు అవలంబిస్తేనే కొన్ని సమస్యలు సరిదిద్దబడతాయని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో చెత్త ప్రచారం, దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు పవన్ కల్యాణ్… సమాజం, రాష్ట్రం, ప్రజలపై కమిట్మెంట్‌తోనే తాను పనిచేస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమన్నారు. ధైర్యం లేని సమాజానికి, ధైర్యం లేని నాయకులు ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే చనిపోయే ముందు కూడా చాలా మంది తాట తీసేంత వరకు పోరాడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరజీవి జలధార ప్రాజెక్ట్ ఏ ఒక్క కులానికి సంబంధించినది కాదని, ఇది అన్ని వర్గాలకు చెందిన ప్రజల ప్రాజెక్ట్ అని పవన్ స్పష్టం చేశారు. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందేనని కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పవన్ కల్యాణ్..
