Drugs: తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తో పట్టుబడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి భూపాలపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీకి తాడేపల్లిగూడెంకు చెందిన యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన ఆన్ లైన్ లింక్ ద్వారా 32 వేల రూపాయల క్రిప్టో కరెన్సీ ఉపయోగించి యువకులు డ్రగ్స్ కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Stock Market: ఒక్కరోజు నష్టాల్లోంచి.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్
ఇక, ఢిల్లీ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా కొకైన్ డ్రగ్స్ తాడేపల్లిగూడెం తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. ఇదే పార్టీకి వచ్చిన మరో ఇద్దరు యువకులు అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర సాధువుల నుంచి గంజాయి కొనుగోలు చేసి పార్టీకి హాజరయ్యారన్నారు. నాలుగు గ్రాముల కొకైన్ సహా 50 గ్రాములు గంజాయి.. మద్యం బాటిళ్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ దేవ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కొరియర్ ద్వారా ఎలాంటి ఆర్డర్లు పెడుతున్నారో నిఘా పెట్టాలని హెచ్చరించారు.