Godavari Flood: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నీటి మట్టం క్రమంగా పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే, నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో వెంటనే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. ప్రస్తుతం బ్యారేజ్‌లోని 175 గేట్ల ద్వారా సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎగువ ప్రాంతాలైన భద్రాచలం, పోలవరం నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తుండటంతో రానున్న మరి కొన్ని గంటల్లో ధవళేశ్వరం వద్ద వరద స్థాయి మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు.
Read Also: Kangana Ranaut : ఫైనలీ.. పెళ్లి రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్
అయితే, వరద ప్రభావంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో నివసించే మత్స్యకారును సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 300 మందిని పునరావాస కేంద్రాలకు పంపించారు. అలాగే, భారీగా వరద వస్తుండటంతో పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మరోవైపు, రాజమండ్రి రైల్వే వంతెనల దగ్గర వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నది ఉగ్రరూపం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని అధికారులు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.