Telugu Desam Party: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనుమతులు తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంపై వివాదాస్పదం అవుతోంది. మరోవైపు అన్నా క్యాంటీన్‌ల ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. పోటీపోటీగా కోడెల శివరాం వర్గీయులు, వైవీ ఆంజనేయులు వర్గీయులు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Bandi Sanjay: గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్‌లోనే నిమజ్జనం..!
ఈ నేపథ్యంలో కోడెల శివరాం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను తొలగించేందుకు వైవీ ఆంజనేయులు అనుచరులు ప్రయత్నించారు. దీంతో కోడెల శివరాం వర్గీయులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. గతంలోనే కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గీయుల మధ్య లుకలుకల విషయం అధిష్టానం దృష్టికి చేరగా.. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పార్టీ ఆదేశిచింది. అయితే అధిష్టానం ఆదేశాలను నేతలు పట్టించుకోలేదు. వర్గాల వారీగా అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో పడాలని ఆశిస్తున్నారు. దీంతో ఇటీవల కోడెల శివరాం అనుచరుడు, తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాల నేతల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్‌ల ఏర్పాట్లు హాట్ టాపిక్‌గా మారింది.