Diarrhea in kolakaluru: డయేరియా కారణంగా గతంలో ఏపీ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కొలకలూరు గ్రామంలో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్ధాలతో కూడిన నీటిని ఇంటింటికి సప్లై చేస్తున్న పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారుతోంది. డయేరియా రావడంతో వందల సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హడావిడి అప్పుడే మర్చిపోయారు. కొలకలూరు గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించే పరిస్థితులు మాత్రం నెలకొనడం లేదు.
గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో మళ్లీ డయేరియా విజృంభించే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఈ గ్రామానికి సరఫరా చేస్తున్న తాగునీరు చూస్తే ఎవరికైనా ఈ మాట అనిపించక తప్పదు. ఈనెల ప్రారంభంలో డయేరియాతో వందల సంఖ్యలో ప్రజలు ఈ గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ బాలిక కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం అధికారులకు తెలియడంతో హుటాహుటిన జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కొలకలూరు గ్రామానికి క్యూ కట్టారు . సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ గ్రామానికి వచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమంటూ హామీ ఇచ్చారు. ఫుడ్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ కోసం ల్యాబ్‌లకు పంపించారు అధికారులు. వాటి ఫలితాలు వచ్చాయో లేదో ఇప్పటికీ తెలియదు. కానీ 15 రోజులు తిరిగేసరికి మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది.
గ్రామంలో సరఫరా అవుతున్న నీరు చూశారంటే ఎవరికైనా భయం కలగక మానదు. గ్రామంలో ఈ కుళాయి చూసిన నల్లటి నీరు పైపుల్లో దర్శనమిస్తుంది. సమీపంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు భూగర్భ జలాలను కలుషితం చేశాయని ఓ పక్క గ్రామస్తులు చెబుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ సమస్యకు ప్రధాన కారణం అవుతోంది. భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్న నేపథ్యంలో నేరుగా కృష్ణ జలాలను తాగునీటి అవసరాలకు వాడుకునేలా పైపులైను ఏర్పాటు చేయాలని సమీపంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి, ఇదే సమస్య ఉందని.. అయితే కొలకలూరు గ్రామానికి సమస్య మరింత తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో ఇలాంటి వ్యవహారాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా, మీడియా ముందు వ్యవహారాన్ని పెట్టినా గ్రామానికి సంబంధించిన కొన్ని ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేయటం, విద్యుత్ సరఫరా నిలిపివేయటం వంటి చర్యలకు అధికారులు పాల్పడుతున్నారని.. సమస్యకు మందు వేయాల్సింది పోయి సమస్యను జఠిలం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..
డయేరియా విజృంభించిన సమయంలో కొన్నాళ్లు ఇంటింటికి ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేశారని.. ఆ తర్వాత ట్యాంకులు క్లీన్ చేశామని, పైపులు శుభ్రం చేశామని చెప్పిన అధికారులు తమ దారికి తమ చూసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సరఫరా అవుతున్న నీటిని చూసి గ్రామస్తులు హడలిపోతున్నారు. ఈ నీటిని తాగితే కచ్చితంగా ప్రాణాలు పోవటం ఖాయమని భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. పోనీ డబ్బులు పెట్టి బయట మంచినీరు కొనుగోలు చేద్దామంటే అంత ఆర్థిక స్థోమత తమకు లేదని కొలకలూరు అంబేద్కర్ కాలనీవాసులు అంటున్నారు. తాము అధికారులను ప్రశ్నిస్తే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని అంటున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు మొత్తం కొలకలూరు వచ్చి సమస్యను పరిశీలించినప్పటికీ ఎందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని.. తమ గ్రామానికి ఎందుకు రక్షిత మంచినీరు ఇవ్వలేకపోతున్నారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో మంచినీరు సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని.. లేదంటే మరోసారి కొలకలూరు గ్రామం వార్తల్లో నిలిచే ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు.