వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేస్తున్నారని విమర్శించారు. అసలు మీటర్లు పెట్టమెందుకు? వాటికి రైతులు డబ్బులు కట్టమెందుకు? తిరిగి మళ్ళీ రైతులకు చెల్లింపులు చేయడమెందుకు? అని ఆయన ప్రశ్నించారు. మీటర్లు వద్దని రైతులు మొత్తుకుంటున్నా.. పట్టు బట్టి మరీ మీటర్లు పెడుతున్నారని, అసలు అంత అవసరం ఏముందని అడిగారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకే జగన్ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
వ్యవసాయ బడ్జెట్ ప్రకారం.. మూడేళ్ల కాలంలో రూ.35 వేల నుంచి రూ. 40 వేల కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగితే, రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్తోందని ధూళిపాళ అన్నారు. అంత డబ్బులు ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టారో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి వ్యవసాయానికి సాయం తగ్గిందన్న ఆయన.. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే జగన్‌కే ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు. ఆర్బీకే కేంద్రాల పేరుతో భారీగా దోపిడీ జరుగుతోందన్నారు. రుణ భారంతో ఏపీ రైతులు అల్లాడిపోతున్నారని, చెప్పిన విధంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు.
కేవలం 1.25 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే లబ్ది చేకూరిస్తూ.. ఎంతో చేశామని ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటోందని ధూళిపాళ అన్నారు. పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేస్తోన్న ప్రతీ రైతుకి లబ్ది చేకూరుతోందని, కానీ ఏపీలో నిబంధనల పేరుతో లబ్దిదారుల సంఖ్యను కుదిస్తున్నారన్నారు. ఇది రైతుల్ని బాదే ప్రభుత్వమని.. ధాన్యం, రొయ్యలు, చేపలు, డెయిరీ ఉత్పత్తుల మీద సెస్ వేసి బాదేస్తున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలోనూ.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలోనూ ఏపీ రాష్ట్రం ఉందని ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.