ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని చెప్పారు. వర్గపోరుకు రెడ్లు స్వస్తి పలకాలని నారాయణస్వామి కోరారు.
కాగా ఇటీవల కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో నారాయణస్వామికి మరోసారి చోటుదక్కింది. గతంలో ఆయనకు ఉన్న డిప్యూటీ సీఎం పదవిని సీఎం జగన్ మరోసారి పొడిగించారు. రెండోసారి డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించే సమయంలో జగన్ ఫోటోను పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌ను దేవుడితో పోల్చారు. దేవుళ్లలో ఉండే లక్షణాలు సీఎం జగన్‌లో ఉన్నాయని.. అందుకే తనకు రెండోసారి డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ పరిణామాన్ని తాను అసలు ఊహించలేదన్నారు. అందుకే జగన్ ఫొటోతో బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించారు.