Deputy CM Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 40వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వచ్చాడని ఆరోపించారు. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచి చంద్రబాబు వారికి చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా ఓడించి లోకల్‌గా ఉంటున్న భరత్‌ను గెలిపించాలని వ్యాఖ్యానించారు. భరత్ గెలిస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని నారాయణస్వామి తెలిపారు.
Read Also:Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
జగన్ పాలనలో కుప్పం ప్రజలు మేల్కొన్నారని.. అందుకే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఈనెల 22న సీఎం జగన్ కుప్పంలో పర్యటించనున్నారని.. ఆయన పర్యటనను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. కుప్పంలో సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. అంతేకాకుండా కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటు అమరావతి ప్రాంత వాసులు చేపట్టిన మహా పాదయాత్రపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శలు చేశారు. అది రైతుల పాదయాత్ర కాదని.. కోటీశ్వరుల యాత్ర అని ఎద్దేవా చేశారు.