భారీవర్షాలు, వరదలు జనానికే కాదు నోరులేని జీవాలకు కూడా ఇబ్బందికరంగా మారాయి. గోదావరి లంకల్లో ఉండే జింకలకు గోదావరి వరదలు శాపంగా మారాయి. గోదావరి వరద ఉధృతికి లంకలు మునిగిపోయి జింకలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. కాపాడడానికి స్థానికులు చేస్తున్నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. కళ్ల ఎదుటే సుమారు 300 వరకు ఉన్న జింకలు గోదావరిలో ఒక్కొక్కటి కొట్టుకుపోవడం చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. కోనసీమ జిల్లాలోని గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహనికి కొట్టుకుపోతున్నాయి.
కోనసీమ జిల్లాలో సుమారు 300 పైబడి జింకలు, లేళ్లు ఉన్నాయి. అయితే ఇవి వరదనీటి ప్రవాహం అధికమవడంతో లంకలు మునిగిపోయాయి. దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి, కొత్తపేట మండలం నారాయణలంకలతో పాటు కడియం మండలం పొట్టిలంకల్లో కొన్ని జింకలు ఒడ్డుకు చేరుకున్నాయి. వీటిలో పొట్టిలంక వద్ద గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది. దీనికి అటవీ శాఖ అధికారులు శవపంచనామా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి. జింకల్ని పట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు అధికారులు. పులసలలంకలో 1500 గొర్రెలు చిక్కుకుపోయాయి. అధికారులు ఎంతగానో శ్రమించి వాటిని బోట్లు, పంట్ల ద్వారా కాపాడారు. బయటకు తరలించారు. జింకల్ని పట్టుకోవడం కుదరదని, మనుషుల్ని చూడగానే అవి పారిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు.
Viral: మత్స్యకారులకి చిక్కిన అరుదైన చేప.. అది అపశకునమట..!