విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలు ముగిశాయి… చివరి రోజైన ఇవాళ నూతన జాతీయ సమితిని ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత నూతన జాతీయ సమితి డి.రాజాను ఏకగ్రీవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది… దీంతో.. రెండోసారి ఏకగ్రీవం రాజా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. కాగా, 2018లో కేరళలోని కొల్లాంలో జరిగిన 23వ జాతీయ మహాసభలో సురవరం సుధాకర్‌రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికకాగా.. ఆయన 2019 జులైలో అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో డి.రాజాను ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి మొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది. ఇప్పుడు రెండసారి 24వ జాతీయ మహాసభలో ఆయనను తిరిగి ఎన్నుకున్నారు ప్రతినిధులు..
ఇక, తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కె.నారాయణ రెండోసారి జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికకాగా.. తెలంగాణకు చెందిన అజీజ్ పాషా మొదటిసారిగా కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. మహాసభ 125 మంది జాతీయ సమితి సభ్యులను , 31 మంది (ఒకస్థానం ఖాళీ) కార్యవర్గ సభ్యులను, 11 మంది కార్యదర్శులను ఎన్నుకుంది. కార్యదర్శివర్గంలోకి అనీ రాజా, గిరీశ్ శర్మలను ఆహ్వానితులుగా తీసుకుంది సీపీఐ.. కార్యదర్శివర్గంలో ముగ్గురు కొత్తవారు అడుగుపెట్టారు.. జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా డి.రాజా, కానం రాజేంద్రన్, అతుల్ కుమార్ అంజాన్, అమర్జీత్ కౌర్, డాక్టర్ కె. నారాయణ, డాక్టర్ బి.కె. కాంగో, బినోయ్ విశ్వం, పల్లభ్ సేన్ గుప్తా, నాగేంద్రనాథ్, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండాలు ఎన్నికయ్యారు. వీరిలో సయ్యద్ అజీజ్ పాషా, నాగేంద్రనాథ్ ఓరా, రామకృష్ణ పాండాలు తొలిసారిగా కార్యదర్శి వర్గానికి ఎన్నికైనవారు కాడం విశేషం..
జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుండి కార్యవర్గానికి కె.రామకృష్ణ, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. తెలంగాణ నుండి జాతీయ సమితి సభ్యులుగా చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, బాలనర్సింహా, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహా, ఎన్.బాలమల్లేశ్ (ఆహ్వానితులు)గా ఎన్నికయ్యారు. కంట్రోల్ కమిషన్‌లో తెలంగాణ నుండి ఏఐటీయూసీ నాయకులు మహ్మద్ యూసుఫ్ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇక, 24వ జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని వ్యాఖ్యానించారు డి. రాజా.. దేశ ఆర్థిక విధానాలు అగమ్య గోచరంగా వున్నాయి. దేశంలో మోడీ పాలన పూర్తిగా విఫలం అయ్యింది.. మోడీ పాలన ప్రజా వ్యతిరేక పాలన.. 2024లో బీజేపీని ఓడించాలి, అందుకు శాయశక్తుల కృషి చేస్తాం అని ప్రకటించారు.. ఆర్ఎస్ఎస్ దేశంలో మతోన్మదాన్ని సృష్టిస్తుందన్న ఆయన.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు లొంగిపోయింది.. ఇది కార్పొరేట్ ప్రభుత్వం.. రూపాయి విలువ తగ్గిపోయింది, నిరుద్యోగం పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.. దేశంలో రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది.. మోడీది ఒక ఫాసిస్ట్ క్యారెక్టర్.. అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి రండి… బీజేపీని ఓడిద్దాం అంటూ పిలుపునిచ్చారు డి. రాజా.