ఇటీవలే ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే త్వరలోనే పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు అని ఆయన స్పష్టం చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని తెలిపారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుంచి గ్రేడ్ల స్థానంలో విద్యార్థులకు మార్కులు ప్రధానం చేసే పద్దతిని ప్రవేశపెట్టామని, విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ర్యాంకులు ప్రకటించడాన్ని నిషేధించామన్నారు. ఎవరైనా చట్టం ఉల్లంఘించినా, ఉల్లంఘించే ప్రయత్నం చేసినా, కుట్ర చేసినా లేదా ప్రోత్సహిస్తే మూడేళ్లకు పైబడి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా జైలు శిక్షతో పాటు జరిమానా రూ. 5 వేల నుంచి రూ. 1 లక్ష వరకు విధిస్తారని ఆయన తెలిపారు.