రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది.
గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను సీఆర్‌డీఏ విక్రయించనుంది. ఇవే కాకుండా మరో 600 ఎకరాల భూమిని అమ్మేందుకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే నెలలోనే సీఆర్‌డీఏ అధికారులు భూములను వేలం వేసి నిధులను సమీకరించనున్నారు. బ్యాంకులు రుణాలిచ్చేందుకు అంగీకరించకపోవటంతో సీఆర్‌డీఏ సొంతంగా నిధుల సమీకరణ చేపట్టింది. భూముల విక్రయం ద్వారా అందే నిధులను రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు సీఆర్‌డీఏ తెలిపింది. కాగా ప్రతి ఏడాది 50 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాలను వేలం పద్ధతిలోనే విక్రయించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది.
Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా