ఏపీ పాలనా వ్యవహారాల్లో కొత్త మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజా పరిణామలను పరిశీలిస్తే వాస్తవం అర్ధం అవుతుంది. తనకు అత్యంత విధేయుడిగా వుండే డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు వేయడం వెనుక ఏం జరిగిందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గౌతమ్ సవాంగ్ ని మారుస్తారని ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాత వార్తలు వచ్చాయి. అవి నిజమని తాజా ఉత్తర్వులతో అవగతం అయింది.
సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌పై బదిలీ వేటు పడి 24 గంటలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విశేషం. 1992 బ్యాచ్‌కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 ఏప్రిల్ 30 వరకు విధుల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ముగ్గురి పేర్లతో.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే డీజీపీగా కసిరెడ్డికి ఏపీ ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం వుంది. డీజీపీకి నియమిస్తూ నిన్ననే జీవో జారీ అయింది.
గౌతమ్ సవాంగ్ బదిలీపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఆయన్ని ఎందుకు బదిలీ చేశారని జనసేనాని పవన్ ప్రశ్నించారు. తాజాగా సీపీఐ కూడా స్పందించింది. గౌతమ్ సవాంగ్ కి తగిన శాస్తి జరిగిందన్నారు సీపీఐ నేత నారాయణ. ఒక ఉన్నత స్థాయిలో వున్న అధికారులు పాలక వర్గం ఏం చెబితే అది చేయాలని భావిస్తే ఇలాంటివే జరుగుతాయన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కి ఎంత మంచి చేశారో తెలుసు. అలాగే పీవీ రమేష్ లాంటివారిని అలాగే చేశారన్నారు.
నిజాయితీగా పనిచేసేవారి పట్ల ప్రభుత్వం గతంలో ఇలాగే వ్యవహరించింది. తప్పుల మీద తప్పులు చేసి, విధేయత చూపించిన వారిని బదిలీ చేయడంతో అధికారులకు కనువిప్పు కావాలన్నారు. ఒకసారి తప్పులు చేయడం మొదలెడితే ఒక మంచి పని చేసినా ఇలాగే జరుగుతుంది. మీ బాధ్యత మీరు చేయండి. మేం చేయలేమని భావిస్తే పక్కకు జరగాలన్నారు నారాయణ.