Site icon NTV Telugu

YS Vivekananda Reddy Case: వైఎస్‌ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు.. వాస్తవాలు వెలికి తీసేందుకు ఒక్కరోజు చాలు..!

Ramakrishna

Ramakrishna

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ, నాలుగేళ్లైనా వైఎస్‌ వివేకానంద రెడ్డి కేసు తేల్చలేదని మండిపడ్డారు.. పులివెందులలో పిల్లల్ని అడిగినా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెబుతారని పేర్కొన్న ఆయన.. వివేకానంద రెడ్డి సామాన్యుడు కాదు… సీబీఐ ఎంత కాలం ఆయన హత్య కేసు దర్యాప్తు చేసింది..? ఆ హత్య కేసులో వాస్తవాలు బయటికి తీయడానికి ఒక్క రోజు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుంది.. ఇది సరైంది కాదని హితవుపలికారు రామకృష్ణ.. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు లేకుండా చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. వివేకానంద రెడ్డి కేసు తెలంగాణకి మార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్ సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.. సొంత బాబాయి కేసులో సరైన దర్యాప్తుకి సహకరించకుండా, న్యాయం జరగకుండా చేసినందుకు జగన్ సిగ్గు పడాలి అంటూ మండిపడ్డారు. మరోవైపు, పేద వర్గాలు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని.. టిడ్కో ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. మూడేళ్ల క్రితం టిడ్కో ఇళ్లు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.. టిడ్కో ఇళ్లు చంద్రబాబు హయాంలో నిర్మించడం వలనే కక్ష పూరితంగా లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Exit mobile version