ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విద్యార్థులకు, యువతకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్స్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడ పడమటలోని కోనేరు బసవయ్య చౌదరి స్కూల్ లో కరోనా కలకలం రేగింది. టీచర్ కు కరోనా పాజిటివ్ రావడంతో యాజమాన్యం మూడురోజులపాటు సెలవు ప్రకటించింది. పాఠశాలలో మొత్తం 1300 విద్యార్థులు, 40 మంది టీచర్లు ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన టీచర్ ఇటీవలే ఎలక్షన్ డ్యూటీని నిర్వహించారు. టీచర్ కు కరోనా సోకడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. స్కూల్ లో కరోనా టెస్టులు చేయాలని స్కూల్ యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే, కరోనా టెస్టింగ్ కిట్స్ లేవని ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. టెస్టులు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంటుందని యాజమాన్యం చెప్తున్నది. దీంతో స్కూల్ కు రావాలంటే టీచర్లు, స్టూడెంట్స్ భయపడుతున్నారు.