దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్.
ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే.. పారిశ్రామిక వేత్తలు రోజుకు కోట్లలో సంపాదిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు బదులు డ్రగ్స్ ఇస్తున్నారని, గుజరాత్ ఫోర్ట్ లో ఒక పారిశ్రామిక వేత్త దగ్గర 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడిందని, ఆయన గురించి పట్టించుకొనే వాడేలేడన్నారు. 3 వేల కిలోల హెరాయిన్ ధర 20 వేల కోట్ల రుపాయలు. అభివృద్ది అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. మోడీ అభివృద్ది పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను అదేవిధంగా రైల్వేలను అమ్మేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ని రెండు సామాజిక వర్గాలు పరిపాలిస్తున్నాయని, ఒక సామాజిక వర్గం 45 సంవత్సరాలు పరిపాలిస్తే, మరో సామాజిక వర్గం 14 సంవత్సరాలు పరిపాలించిందన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మరో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఏంచేశారో చెప్పాలన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చారా లేదా అనేది తెలియకుండా చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కాపు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారన్నారు.
చంద్రబాబు నాయుడు,జగన్ మోహన్ రెడ్డిలు పరిపాలించింది చాలు ఇక వదిలిపెట్టి వెళ్లిపోవాలన్నారు. తాను చదువుకొనేటప్పుడు 18 రూపాయల అణా పైసలు స్కాలర్ షిప్ వచ్చిందన్నారు. కానీ ఏపీలో గడచిన రెండేళ్ళ నుంచి స్కాలర్ షిప్ రావడం లేదన్నారు. దీపావళి నాటికి పెండింగ్‌లో వున్న స్కాలర్ షిప్‌లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. అనంతపురము జిల్లాకు నీలం సంజీవరెడ్డి పేరు పెట్టాలన్నారు. ప్రశాంత్ కిషోర్ లు ఎంతమంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్టాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాష్టంలో టీడీపీ, వైసీపీల గురించి ప్రజలు విసిగి పోయారని, కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారన్నారు.