తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్నే బద్వేల్లోనూ జగన్ కొనసాగించనున్నారా? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా? ఇంతకీ బద్వేల్ విషయంలో వైసీపీ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసింది? తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బహిరంగ సభ పెట్టాలని అప్పట్లో సీఎం జగన్ భావించినా కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేశారాయన. అప్పట్లో ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా అక్కడ మంచి మెజార్టీతో వైసీపీ గెలిచింది.
ప్రస్తుతం బద్వేల్ ప్రచారానికి వెళ్లి బహిరంగ సభ నిర్వహిస్తే… మళ్లీ కరోనా కోరలుచాచే అవకాశం ఉందన్న భయం వెంటాడుతోంది. దీంతో తిరుపతి మాదిరిగానే బద్వేల్ ఓటర్లకు లేఖలు రాయాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. ఒక్కో కుటుంబానికి ఒక్కో లేఖను పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లి పంచుతారు. మొదటి లేఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సంతకం చేస్తారు. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరించే బాధ్యతను మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. గత ఎన్నికల్లో వచ్చిన 44 వేల మెజార్టీ కంటే ఎక్కువగా సాధించాలని నేతలకు టార్గెట్ పెట్టారు జగన్.