CM Jagan: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ప్రపంచం మారుతుంటే.. చదువులు కూడా మారుతున్నాయని.. తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 1958 కాలంలో పరిస్ధితులే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు తేవాలని సంకల్పించామని.. అందుకే అధికారంలోకి రాగానే మన బడుల్ని, పిల్లల్ని బాగు చేయాలని అనేక మార్పులు చేశామన్నారు. విద్యారంగంలో మార్పులు తెస్తే రాజకీయ దురుద్దేశం అంటున్నారని.. విద్యారంగంపై, పిల్లల చదువుపై మనం పెట్టేది పెట్టుబడి అని.. మానవ వనరులపైనా మనం పెట్టుబడి పెడుతున్నామని జగన్ అన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, మిడ్ డే మీల్స్‌ను నీరు గార్చారని.. ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు సకాలంలో రాకుండా విద్యా వ్యవస్ధను నాశనం చేశారని సీఎం జగన్ మండిపడ్దారు.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కుళ్లను ప్రోత్సహించేవారని సీఎం జగన్ విమర్శలు చేశారు. స్కూళ్ళలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు బడులకు వెళ్లేవారు కాదన్నారు. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలో గతంలో బడులు అధ్వాన్నంగా ఉండేవి అని.. ప్రస్తుతం నారా వారి పల్లెలో ప్రభుత్వ బడులు సుందరంగా తయారు చేశామన్నారు. కుప్పంలోనూ అదే పరిస్ధితి ఉందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వ బడులను గతంలో గాలికొదిలేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయినా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోలేకపోతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే తరం వారికి నాణ్యమైన విద్యనందిస్తే వారి జీవన ప్రమాణాలు పెంపొందుతాయన్నారు. వారిని గొప్పగా చదివించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. విద్యారంగంలో మన బడి నాడు-నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు. త్వరలో 56 వేల స్కూళ్లు, కాలేజీల రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు. 15 వేలకు పైగా స్కూళ్ళలో డిజిటలైజేషన్ చేయబోతున్నామన్నారు. స్కూళ్లలో సదుపాయాలు కల్పించడమే కాకుండా ఇతర నిర్వహణపైనా దృష్టి పెట్టామన్నారు.
స్కూళ్లలో నిర్వహణ నిధి ఏర్పాటు చేయడం దేశంలోనే మన రాష్ట్రంలోనే తొలిసారి అని సీఎం జగన్ అన్నారు. స్కూల్ భవన నిర్వహణకు అమ్మ ఒడి ద్వారా ఖర్చు చేస్తున్నామన్నారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలని విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యార్థి కాలేజీ చదువు అయ్యే దాక ప్రభుత్వమే చేయి పట్టుకుని నడిపిస్తోందన్నారు. 18 నుంచి 23 ఏళ్లలో మన దేశంలో 29 శాతం మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారని.. ఇది 2033 కల్లా 70 శాతానికి పైగా చేరుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రైమరీ ఎడ్యకేషన్‌లో మనది 84.48 శాతం ఉండేదని.. 2016-17 లెక్కల్లో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అట్టడుగున ఉందన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో విప్లవాత్మక చర్యలు ఎంత అవసరమో అర్ధం చేసుకోవాలన్నారు. అమ్మ ఒడి లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదని.. 84 లక్షల మంది పిల్లలకు గత మూడేళ్ళలో 19,610 కోట్లు అమ్మ ఒడి ద్వారా ఖర్చు చేశామన్నారు. గోరుముద్ద ద్వారా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. అన్నం వండించే ఆయాల వేతనం వెయ్యి నుంచి 3 వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల భోజనం కోసం ఏడాదికి 450 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో గోరు ముద్దకు 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
విద్యా కానుక ద్వారా స్కూలులో చేరే ప్రతి పిల్లోడికి స్కూలు యూనిఫారం నుంచి అన్ని అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. ఈ పథకానికి 860 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 8వ తరగతికి వచ్చే విద్యార్థులకు నవంబర్ నెలాఖరుకి ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.12,800 ఉంటుందన్నారు. 2025లో పిల్లలు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్ష రాస్తారని.. వారందరినీ సన్నద్ధం చేసేందుకు ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బయట మార్కెట్‌లో ట్యాబ్ కొనుగోలు చేస్తే 20 నుంచి 24 వేలు ఖర్చు అవుతుందన్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో 37 లక్షల 20 వేల మంది చదివితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 44,29,564 మంది చదువుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెండిన బకాయిలను తమ ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. వసతి దీవెన ద్వారా 17 లక్షల 77 వేల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. వసతి దీవెన , విద్యా దీవెన ద్వారా 11 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడించారు.
పిల్లల భవిష్యత్తు కోసమే వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. స్కూళ్లలో ఖర్చు చేస్తున్న ఫలాలు ఆలస్యమవ్వొచ్చు కానీ ఒక్కసారి ఫలాలు అందితే మనం ప్రపంచంతో పోటీ పడతామన్నారు. ఏపీలో విద్యా రంగంతో పాటు వైద్య రంగంలో మార్పులు తెచ్చామన్నారు. గత ప్రభుత్వంలో సెల్‌ఫోన్‌లు పెట్టుకొని ఆపరేషన్లు చేసేవారని.. ఎలుకలు దూరిన ఘటనలు గత ప్రభుత్వంలో ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. వైఎస్ మరణాంతరం ఆరోగ్య శ్రీని పూర్తిగా విస్మరించారని జగన్ ఆరోపించారు. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలను క్లియర్ చేశామన్నారు. బాలకృష్ణ నడుపుతున్న బసవ తారకం ఆస్పత్రిలో చంద్రబాబు కన్నా మన హయాంలోనే బిల్లులు తొందరగా క్లియర్ అవుతున్నాయని జగన్ తెలిపారు. 3118 వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందుతుందన్నారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో హాస్పిటల్స్ లో రూపు రేఖల మార్పు కోసం 16,255 కోట్లు చేస్తున్నామని తెలిపారు. అటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో రోగులకు డాక్టర్లు మరింత చేరువ అవుతారన్నారు. ఆస్పత్రుల్లో నర్సులు, డాక్టర్లు లేని పరిస్ధితి నుంచి అక్టోబరు 15 కల్లా ప్రతి ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. మూడేళ్ళలో వైద్య రంగంలో 44 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్నామని తెలిపారు. 1268 కోట్ల నిధులను నాడు నేడు ద్వారా ఖర్చు చేస్తున్నామన్నారు. వచ్చే రెండేళ్ళలో విద్య, వైద్య రంగంలో మార్పులు కనబడతాయని సీఎం జగన్ అన్నారు.