CM Jagan: కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా నీళ్లు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇదే రాష్ట్రమని.. ఇదే బడ్జెట్ ఉందని.. కానీ అప్పుడు అప్పులు ఎక్కువ.. ఇప్పుడు అప్పులు తక్కువగా ఉన్నాయని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో కంటే అప్పులు తక్కువే చేశామని.. ప్రజలు ఈ సంగతి గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎందుకు ఇవ్వలేదో ఆలోచించాలన్నారు.
Read Also: Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…
తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరి తలరాతలు మారుతున్నాయని.. ఎక్కడా లంచాలకు తావు లేకుండా పరిపాలన చేస్తున్నామని జగన్ వెల్లడించారు. మూడు లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజలందరికీ మేలు చేస్తున్నామని తెలిపారు. పులివెందులలో రూ.120 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని.. 5 జంక్షన్‌లలో చేసిన అభివృద్ధి పనులు రాష్ట్రమంతా చూడాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని ప్రారంభిస్తున్నప్పుడు ఎంతో సంతోషం వేసిందన్నారు. తాను పులివెందులలో ఉన్నానా లేదా సిటీలో ఉన్నానా అనే భావన కలిగిందన్నారు. పులివెందులలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని.. జూన్ నాటికి ఆసుపత్రి, డిసెంబర్ 23 నాటికి మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని జగన్ తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి సాగు, తాగు నీరు అందించే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.