Site icon NTV Telugu

CM JAGAN: ఏపీలో ఇవాళ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

Cm Jagan

Cm Jagan

ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇవాళ విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్నారు సీఎం వైయస్‌ జగన్‌. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా గురు పూజోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరుగుతోంది. ఏపీలో 176 మంది టీచర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది ప్రభుత్వం.

ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు.

Read Also: Jharkhand Crisis:జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నేడే

ఇదిలా వుంటే ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవానికి దూరంగా ఉండాలని ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్‌ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆయా సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అనేక శాంతియుత ఉద్యమాల ద్వారా సీపీఎస్‌ రద్దు కోసం డిమాండ్‌ చేశామని, కానీ ఈ ప్రభుత్వం వైఖరి సమంజసంగా లేదన్నారు.. రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉపాధ్యాయులు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని APCPSUS రాష్ట్ర అధ్యక్షుడు దాస్ తెలిపారు.

Read Also: Astrology: సెప్టెంబర్‌5, సోమవారం దినఫలాలు

Exit mobile version