రెండేళ్లపాలన కూడా పూర్తికాకముందే వరుసగా మూడో ఏడాది మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా సామాన్యుడికి ఉన్న కష్టం పెద్దది. నేరుగా వారి అక్కౌంట్లోకి సుమారు రూ.120 కోట్లు పంపుతున్నాం. ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమంద్వారా దాదాపుగా రూ.332 కోట్ల రూపాయలు మత్స్యకార కుటుంబాలకు అందించాం. మీ ఇంట్లో అన్నగా, తమ్ముడిగా సంతోషపడుతున్నా అని జగన్ తెలిపారు.
ప్రతి పథకం, ప్రతి అడుగులో కూడా అక్కచెల్లెమ్మలకోసం, పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో ముందుకెళ్తున్నాం. వాలంటీర్ల, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ద్వారా పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమాలను చేపడుతున్నాం. గతంలో మత్స్యకార కుటుంబాలకు పేరుకు మాత్రం ఇస్తామని చెప్పేవారు.. అది ఎవరికి వచ్చేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో, ఏ రోజు ఇస్తారో తెలిసేది కాదు. ఆ ఇచ్చే నాలుగు వేలు కూడా దక్కని పరిస్థితి. ఆరోజుల్లో లీటరు డీజిలు మీద రూ.6 లు సబ్సిడీ అని చెప్పేవారు.. కాని, ఎవ్వరికీ దక్కని పరిస్థితులు. అప్పట్లో 5వేల బోట్లకు అర్హత ఉంటే ఇప్పుడు 24వేలకు పైగా బోట్లకు డీజిలు సబ్సిడీ ఇప్పుడు ఇస్తున్నాం. 100 పెట్రోలు పంపులను డెడికేట్ చేస్తున్నాం. ఇప్పుడు లీటరుపై రూ.9ల సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నాం అని అన్నారు. వేటకు వెళ్లిన సమయంలో జరగరానిది జరిగితే.. గతంలో ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు. రూ. 1.50కే యూనిట్ కరెంటును అందిస్తున్నాం. రూ.780 కోట్ల సబ్సిడీని 53,550 మంది రైతులకు అందిస్తున్నాం అని జగన్ పేర్కొన్నారు.