జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతిస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా ఉందని జగన్ విమర్శించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు అని.. కానీ చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే సమ్మెలు, ఆందోళనలు చేయడం కావాలని కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దత్తపుత్రుడికే ఆందోళనలు కావాలని ఎద్దేవా చేశారు.
Read Also: ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమ ప్రభుత్వం రాకముందు వరకు 3.97 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, తాము వచ్చిన రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని సీఎం జగన్ గుర్తుచేశారు. సచివాలయాల్లో 1.20 లక్షలు ఉద్యోగాలిచ్చామని, 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని జగన్ పేర్కొన్నారు. అయినా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఆశా కార్యకర్తలు, నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ఫ్రంట్ పేజీలో వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.