Vijayawada: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Read Also: Snake In Mid-Day Meal: మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
ఈ సందర్భంగా రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని గమనించిన దేవినేని అవినాష్.. ఈ జెండా మనం పెట్టిందేనా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. మీరు గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామని ఆమె చెప్పారు. దీంతో అవినాష్ మౌనంగా ఉండిపోయారు. మీ వెంటే తిరిగామని అయినా తమకు మోసం జరిగిందని కార్పొరేటర్‌ను చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ మహిళలు సమస్యలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ మహిళలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఈ ఘర్షణకు టీడీపీ కుట్రే కారణమని దేవినేని అవినాష్ ఆరోపించారు. గద్దె రామ్మోహన్ ఓటమి భయంలో ఉన్నారని.. టీడీపీ వాళ్లే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.