ఏపీలో సంచలనం కలిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాు.ఈ స్కాంలో సీఐడీ విచారణ లోతుగా కొనసాగిస్తోంది. రూ.242 కోట్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో సీఐడీ విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. డిజైన్ టెక్ కి తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని పూణే సంస్థలు స్పష్టం చేశాయని తెలుస్తోంది. తాము కేవలం షెల్ కంపెనీలుగా మాత్రమే వ్యవహరించినట్టు ఒప్పుకున్నాయి. కేసులో ప్రధాన నిందితులు గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఇళ్లలో సీఐడీ సోదాలు పూర్తయ్యాయి. ఇవాళ పూణేకు చెందిన షెల్ కంపెనీల ప్రతినిధులను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
విశ్రాంత ఐఎఎస్ లక్ష్మీనారాయణ తన పదవీ కాలంలో యువకులకు శిక్షణనిచ్చే క్రమంలో..పలు అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో సిమన్స్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై విచారణను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలు పరిశీలించింది సీఐడీ. ఇదిలా వుంటే కుట్రపూరితంగానే తనపై అభియోగాలు మోపారని.. నిజాయతీగా పనిచేసిన తనలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇబ్బంది పెట్టడం సబబు కాదని లక్ష్మీనారాయణ అంటున్నారు.