ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే తామేం తక్కువ కాదు అన్నట్లు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డులు తిరగరాస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.312కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అటు తెలంగాణలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.304 దాటింది. మే 1న రూ.238గా ఉన్న ధర గత 10 రోజుల్లో రూ.74 మేర పెరిగింది.
Home Loan: వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. హోంలోన్లపై భారం..!
కొనసాగుతున్న ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా చికెన్ లభ్యం కాక ధరలు భారీగా పెరిగినట్లు చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వాళ్లు సూచిస్తున్నారు. సాధారణంగా వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. కానీ ఇప్పుడు కోడి కిలోన్నర కూడా రావడం లేదని, ఫారంలో ఉంచితే ఎండకు చనిపోతాయనే భయంతో వెంటనే అమ్మేస్తున్నట్లు కొందరు వ్యాపారులు వాపోతున్నారు. వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.