తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.
సాధారణంగా వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో కిలో చికెన్ ధర రూ.160 నుంచి రూ.180 మధ్యలో ఉండేది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్ల ఫారంలలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారాలలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకురావడం వంటి కారణాలు చికెన్ ధరను పెంచేశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కోడిపిల్లలు మృత్యువాత పడతాయని, దానికితోడు బర్డ్ ఫ్లూ వదంతులతో కొత్త బ్రీడ్ వేయడంలేదని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్లుగా చికెన్ సరఫరా ఉండడం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ధరలు పెరగడంతో ఆదివారం వస్తే రద్దీగా ఉండే నాన్-వెజ్ మార్కెట్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చికెన్ షాపుల వైపు వెళ్తే జేబుకి చిల్లు పడేలా ఉందని.. పలువురు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.