Chandrababu: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తొలిసారిగా తాను అనురాగదేవత సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను కలిశానని.. తన తొలి భేటీలోనే ఎన్టీఆర్ ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారని చెప్పారు. ఒక సినిమా నటుడిగా వచ్చి.. తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి భావితరాలకు కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు.
ఆనాడు నాకెందుకు రాజకీయం అని ఎన్టీఆర్ అనుకుని ఉంటే తెలుగు జాతి ఏమయ్యేదో ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు గట్టిగా ప్రశ్నించే విధానాన్ని, చైతన్యాన్ని అందించింది ఎన్టీఆర్ అని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలను ప్రశ్నించాలన్నారు. టీడీపీ నేతలు మీటింగ్ పెట్టుకుంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని. కందుకూరులో అంతమంది జనం వస్తే పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో నంబర్ 1 తెచ్చి ప్రతిపక్షాలను జగన్ తొక్కేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే.. తరువాత కాలంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా తాను పనిచేశానని తెలిపారు. నాడు ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకంగా మారిందన్నారు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ క్రియేటర్ సీఎంలలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారని.. ఇప్పుడు అతి పెద్ద విధ్వంసకులైన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 29 ఏళ్ల వయసులోనే యనమల వంటి నేతలను కేబినెట్‌లోకి తీసుకున్న ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు వివరించారు.
తెలుగుజాతి సేవకే ఎన్టీఆర్ జీవితం అంకితం : @ncbn#NTRLivesOn #NCBN pic.twitter.com/oivtcYR233
— Telugu Desam Party (@JaiTDP) January 18, 2023