రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. ఓ వైపు ఒంటరిగానైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఆయన.. మరోవైపు అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇది మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల సీఎం అంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబు చెప్పాలనుకున్నది పవన్ నోట చెప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నారావారిపల్లి నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు.. నిన్న పవన్ కల్యాణ్ సభ పెట్టి చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని తెలిపారు.. ఎందుకు వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ను తిడుతున్నారు? ఎందుకు అంత భయం? ఎందుకు అంత పిరికితనం? అని ఎద్దేవా చేశారు.. అధికారం ఉందన్న అహంకారం మంచికాదు.. ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు..
Read Also: TSLPRB : పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు
ఈ సంక్రాంతి ఒక ఆశను, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ఇస్తుందని ఆకాక్షించారు చంద్రబాబు.. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్న ఆయన.. సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు.. కానీ, తప్పు చేస్తూ ఎదురుదాడి ద్వారా కప్పి పుచ్చుకుంటున్నారని మండిపడ్డారు.. కేసులకు భయపడే పరిస్థితి లేదు.. కార్యకర్తలు తెగించి రోడ్డుపైకి వస్తున్నారని తెలిపారు చంద్రబాబు.. జైలులో పేట్టి భయబ్రాంతులకు గురిచేస్తే లొంగిపోరని స్పష్టం చేశారు.. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదు.. కానీ, వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా..? అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా పోరాటం ఆగదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటానని ప్రకటించారు.. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు.. విధ్వంసానికి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వమిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..