NTV Telugu Site icon

CBN: సైకో పాలన భూస్థాపితం చేసేవరకు.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటా..

Chandrababu

Chandrababu

మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థల మీద కేసులపై కేసులు పెట్టారని విమర్శించారు.. 2014లో గెలిపించారు.. పోలవరం ప్రాజెక్ట్ నేను నాటిన మొక్క.. నా ప్రాణం పోలవరం.. 28 సార్లు పోలవరం వెళ్లా.. 82 సార్లు సమీక్షలు చేశా.. 72 శాతం పనులు పూర్తి చేశాం.. దేని కోసం.. మన రైతుల కోసం.. దూరదృష్టితో పనిచేశా.. కానీ, ఇప్పుడు నేను పోలవరం వెళ్తే అడ్డుకున్నారని మండిపడ్డారు..

Read Also: LIC launches its WhatsApp Services: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎల్‌ఐసీ.. ఇక, అన్ని సేవలు వాట్సాప్‌లోనే..!

ఇక, తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోకి తెచ్చిన ఘనత నాదే.. అప్పుడు బీజేపీతో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఆ మండలాలను తీసుకొచ్చా.. ఏడు మండలాలను ఏపీకి ఇస్తేనే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పా.. లేకపోతే నాకు పదవి అవసరం లేదని చెప్పానని.. దీంతో, ఆర్డినెన్స్‌తో ఆ పని పూర్తిఅయ్యిందన్నారు.. అది అంతా రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమతోనే చేశానని తెలిపారు చంద్రబాబు.. మరోవైపు, ఇదే నాకు చివరి ఎన్నిక అంటున్నారు.. సైకో పాలన భూస్థాపితం చేసేవరకు ఉంటా.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటానని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు.. అసలు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయేనన్న ఆయన.. రెండు రూపాయల కిలో బియ్యం, వ్యవసాయ మోటర్లకి మీటర్లు తీసేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.. కానీ, ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారు, టిడ్కో ఇళ్ళను ఇవ్వలేకపోయారు.. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎన్నో పథకాలు పెట్టాం.. ఈ ప్రభుత్వంలో వాళ్ళకీ ఒక్క రూపాయి అందలేదని ఆరోపించారు.. ఇప్పటి నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండకపోతే పోలీసుల చేతుల్లో మనం బలైపోతాం అంటూ కార్యకర్తలను అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.