NTV Telugu Site icon

Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.

Chandrababu

Chandrababu

శాసన సభలో పార్టీ ఎమ్మెల్యే స్వామిపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.. సీఎం వైఎస్‌ జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారు.. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు అంటూ ఫైర్‌ అయ్యారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాడన్న ఆయన.. స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌ఖు పిచ్చెక్కి ఇలా వ్యవహరించాడని.. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.

ఇక, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యేలు దేవాలయం లాంటి సభలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారు.. డోలా బాలవీరాంజనేయ స్వామి పై సుధాకర్ బాబు, ఎలీజాలు దాడి చేశారు.. వెల్లంపల్లి మా స్థానాల్లోకి వచ్చి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై దాడి చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారు.. ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన ఘటన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. మాపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాపై అసత్యాలు చెప్తున్నారన్న ఆయన.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు వీడియో ఉంటే ఎలాంటి చర్యలైనా మాపై తీసుకోండి అని సవాల్‌ చేశారు. కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిట్ చేయని వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు..

మరోవైపు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. కౌరవ సభకంటే దారుణంగా అసెంబ్లీ తయారైందన్నారు.. ఇద్దరు ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరిలపై మూకమ్ముడిగా దాడి చేశారన్న ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు మాదకద్రవ్యాలు సేవించి సభకు వచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు.. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మినిట్ టు మినిట్ వీడియోను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.. కెమెరాలు ఆఫ్ చేసి దాడి చేసి ఉంటారని మా అనుమానం ఉందన్నారు ఏలూరి సాంబశివరావు. ఇక, టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాపై దాడి జరిగితే, మమ్మల్నే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. 40ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న నేను, ఈరోజు లాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం హక్కులన్నీ సభలో హరిస్తున్నారు.. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని హెచ్చరించారు.. స్పీకర్ కి సభలో ఒక వైపే ప్రేమ ఉంటోందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా?గతంలో మా దగ్గర పనిచేసిన ఈ స్పీకర్ ఈ సీఎం దగ్గర చప్రాసిలా మారారు..! అంటూ మండిపడ్డారు బుచ్చయ్య చౌదరి.

Show comments