Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రచారపర్వంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు… 2024 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నాందిగా అభివర్ణించారు.. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి రెండో ప్రాధాన్యం ఓటు పీడీఎఫ్‌కు వేయాలని.. వైసీపీకి ఎవరూ ఎలాంటి ఓటు వేయొద్దు అని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీలో లేకపోయినా మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు వేయండని సూచించారు. సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో వర్చువల్‌గా సమావేశమైన చంద్రబాబు.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jairam Ramesh : 119 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ధరణి అదాలత్ కార్యక్రమాలు
వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై కీలక విచారణ జరుగుతుంటే.. స్కిల్ డెవలెప్మెంట్ పై తప్పుడు కేసులతో అసలు విషయాన్ని మళ్లించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.. సమాజంలో చీడపురుగులకు గుణపాఠం చెప్పకపోతే ఇంకా రెచ్చిపోతారని హెచ్చరించారు. వైసీపీ లాంటి ప్రభుత్వం వస్తుందని ఊహించి ఉంటే నేను కూడా లా చేసేవాడిని.. నన్ను నేను డిఫెండ్ చేసుకోవటానికైనా న్యాయవాదినయ్యేవాడినన్నారు.. కానీ, ఎంఏ ఎకనామిక్స్ చేయటం వల్ల సంపద సృష్టి, అభివృద్ధిపై నా ఆలోచనలు వెళ్లాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 30శాతం దొంగ ఓట్లు చేర్చిందని ఆరోపించారు. తిరుపతిలో సుందరయ్య హౌసింగ్ కాలనీ 225 బూత్ లో ఒకే ఇంటి అడ్రెస్ లో 14 బోగస్ ఓట్లున్నాయని.. 223 పోలింగ్ బూత్ లో 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్లందరికీ ఓటు హక్కు ఇచ్చేశారని.. వైసీపీ కార్యాలయం అడ్రస్సుతో 34 ఓట్లు చేర్చారని.. నిజమైన పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారో లేక నాశనం చేసుకుంటారో ఆలోచన చేయాలని సూచించారు చంద్రబాబు.
అభివృద్ధిలో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ నేడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందని.. భావితరాల భవిష్యత్తు కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు చంద్రబాబు.. శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటేయాలన్నారు.. అవినీతి డబ్బుతో ఉపాధ్యాయ ఓట్లు కొనేందుకు సిద్ధమయ్యారు.. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో లేకున్నా పోయినా ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం హెచ్చరిస్తున్నా.. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లే నంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలయ్యాక మీ జీతాల్లో కోత పెట్టడంతో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు లేకుండా చేస్తారన్న ఆయన.. రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లనూ గౌరవించేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.. ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నేడు గౌరవం లేకుండా పోయింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమైపోయింది. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగే వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పేదరికం లేని కుటుంబ స్థాపనే నా లక్ష్యంగా పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.