ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కూడా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించే కేంద్రమంత్రి ప్రశ్నించారని చంద్రబాబు తెలిపారు. జగన్ సీఎం అయినంత మాత్రాన జవాబుదారీతనానికి అతీతుడా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగోనే అని.. చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్ల 62 మంది చనిపోయారని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: కుప్పం ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా..?
ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలను బలిగొంటారా అని ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలిసో.. తెలియకో ఓట్లేస్తే ప్రభుత్వం చేసే పని ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. ముందస్తుగా వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు చేసినా సీఎం పట్టించుకోరా అని నిలదీశారు. హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఉదాసీనంగా ఉండడం వల్లే ప్రాణాలు పోయాయన్నారు. ముమ్మాటికీ ఇవి ప్రభుత్వ హత్యలే అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరు వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరదలు వచ్చిన సమయంలో అధికారులు, మంత్రులు ఏమయ్యారని ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా ఐదో గేటు పని చేయలేదని.. అప్పట్లో ఐదో గేటు పని చేయకుండానే మిగిలిన గేట్ల నుంచి నీళ్లు వెళ్లిపోయాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చిన వరదలకు కూడా ఐదో గేట్ పని చేయలేదన్నారు. గతేడాది మూడు గేట్లు పని చేయకుంటే రెండు గేట్లని రిపేర్ చేయించి.. ఓ గేట్ వదిలేశారని.. దీని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని చంద్రబాబు స్పష్టం చేశారు. తమను ఎవ్వరూ హెచ్చరించలేదని నేను పర్యటించినప్పుడు బాధితులు తనకు చెప్పారన్నారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 19వ తేదీన వరద వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోతే.. కుప్పంలో ఓడిపోయాం కాబట్టి.. సీఎం జగన్ అసెంబ్లీలో నా మొహం చూడాలంటారా..? ప్రజలు కష్టాల పాలవుతున్నా పట్టించుకోకుండా సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు మండిపడ్డారు.