మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రబాబు.. ‘ఇది కూల్చివేతల ప్రభుత్వం. ప్రజావేదిక విధ్వంసానికి మూడేళ్లు. తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేతే. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ.. తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం జగన్ వివరించి నేటికి మూడేళ్లు. కూల్చివేతలే తప్ప జగనుకు నిర్మాణం చేతకాదు. ఏపీ అభివృద్ధిని కూల్చాడు. రాష్ట్ర ఆర్థిక స్థాయిని కూల్చాడు.
ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడు. దళితుల గూడును, యువత భవితను కూల్చాడు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్.. మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ.. తన వల్ల ఏమీ కాదని.. తనకు ఏమీ రాదని సీఎం జగన్ తేల్చి చెప్పేశాడు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలి’ అంటూ పోస్ట్ చేశారు.