మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, ఇంఛార్జుల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్లపై చంద్రబాబు సమీక్షించారు. నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల కో-ఆర్డినేటర్లు చినరాజప్ప, గణబాబు, బుద్దా వెంకన్నలతో విడివిడిగా టీడీపీ అధినేత సమీక్ష జరిపారు. రోడ్డెక్కని నేతలు, పని చేయని నాయకుల విషయంలో నివేదికలు ఇవ్వాలని వారిని చంద్రబాబు ఆదేశించారు.
కాగా నేతల పని తీరులో నెల రోజుల్లో సమూల మార్పు రావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులు కనిపించకూడదని.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీలో నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలు మొదలు పెట్టాలని హితవు పలికారు. 15 రోజుల పాటు పార్లమెంట్ కో ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని పేర్కొన్నారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇదే విషయాన్ని ఆయా నేతలకు అర్థం అయ్యేలా చెప్పాలని పార్లమెంట్ సెగ్మెంట్ల కో ఆర్డినేటర్లకు చంద్రబాబు తెలియజేశారు.