పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్ హీరో మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. సినిమాల్లో పవన్ ప్రధాని, సీఎం, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో ఆయన సీఎం కాలేడని ఆమె జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లపై పంచ్‌లు విసిరారు. టీడీపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వచ్చినా జగన్ అనే సింహం సింగిల్‌గానే వస్తుందని ఆమె చెప్పారు.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉందా? లేదంటే పదవులే పరమావధిగా పెట్టుకున్నారా? అన్న విషయంపై పవన్ కళ్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోరాటం చేసే నేత కాదని, నిత్యం ఆయన పొత్తులతోనే ముందుకు సాగుతున్నారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ఉంటుందని రోజా చెప్పుకొచ్చారు.